హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నుంచి దశలవారీగా అసెంబ్లీ ముట్టడికి తరలివస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అరెస్ట్ చేస్తుండటంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని బలవంతంగా అడ్డుకున్నారు.

రామచందర్‌రావు అరెస్ట్ సమయంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో గన్‌పార్క్ ప్రాంతంలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. రామచందర్‌రావును పోలీసులు వాహనంలో తరలించకుండా బీజేవైఎం నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పోలీస్ వాహనంపైకి ఎక్కడంతో, పోలీసులు వెంటనే ఆయనను కిందకు లాగివేశారు. ఆ వెంటనే పలువురు కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకుని ఆందోళన చేశారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తలకు చేతులు విరగగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వరుస ఆందోళనలు, ముట్టడి యత్నాలతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ఇప్పటికీ హైటెన్షన్ వాతావరణంలో కొనసాగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 01:27 PM IST
Tags: