ఇంటర్ నెట్ డెస్క్: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలని, శాసనసభ మరియు మండలిలో జరిగే ప్రతి చర్చలోనూ క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు. ఉభయసభల్లో కాంగ్రెస్, బీజేపీ విధానాలను తీవ్రంగా ఎండగట్టాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ అసెంబ్లీలోనూ, బయటా బూతులు మాట్లాడుతున్నారని, పాలన చేతకాకనే ఈ తరహా అవాస్తవాలు, దిగజారుడు ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తిగా అట్టర్‌ఫ్లాప్ అయిందని, రాష్ట్రంలో థర్డ్ క్లాస్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం ఖాయమని, ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తథ్యమని ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. రాబోయే ఎన్నికల భయంతోనే ఈ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సభలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు పక్షపాత ధోరణితో, పూర్తిగా అప్రజాస్వామికంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

బూతుల వీరుడితో చర్చకు రమ్మంటున్నారని, తన చావును కోరుతూ పదే పదే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని, నేడు తెలంగాణ 'రైజింగ్' కాకుండా తీవ్రంగా 'డౌన్‌ఫాల్' అవుతోందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 05:18 PM IST
Tags: