కొల్లాపూర్: ఎన్మనబెట్ల గ్రామ పాఠశాలలో మ్యాథ్స్, సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో అన్ని తరగతుల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలోని మ్యాథ్స్ టీచర్ డిప్యూటేషన్‌పై వనపర్తికి వెళ్లడం వల్ల గణిత బోధనకు అంతరాయం కలుగుతుండగా, మరోవైపు సైన్స్ టీచర్ పోస్టు కూడా ఖాళీగా ఉండటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత తరగతుల వరకు విద్యార్థుల చదువులకు ఉపాధ్యాయుల కొరత పెద్ద సమస్యగా మారకుండా, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ సింధుజ సురేందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న మ్యాథ్స్, సైన్స్ టీచర్ పోస్టులను అతి త్వరలో భర్తీ చేయాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ కి ఆమె వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. “మన గ్రామంలోని ఏ ఒక్క విద్యార్థి కూడా ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బంది పడకూడదు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే ఉపాధ్యాయులను నియమించాలి. ఒకవేళ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతాం” అని తీవ్రంగా హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేస్తామని, పిల్లల చదువులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 8 Sept 2026 | 09:38 AM IST
Tags: