హైదరాబాద్ / షాద్‌నగర్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఎమ్మెల్సీ, షాద్‌నగర్ బీఆర్ఎస్ ప్రముఖ నాయకుడు ఎన్. నవీన్ రెడ్డిని పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న ఆయన స్వగృహానికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

పోలీసులు తన నివాసానికి వచ్చి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారిని తీవ్రంగా నిలదీశారు. అసలు తనను ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తున్నారని, ఎవరు ఫిర్యాదు చేశారని అధికారులను ప్రశ్నించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు కేసు నమోదైందని పోలీసులు ఆయనకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా, ఆయన భార్య లక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, అక్రమంగా అరెస్టు చేయవద్దని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలను స్వయంగా రికార్డ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "పొద్దున లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులను తిడుతున్నారు, మరి సీఎంను ఎందుకు అరెస్టు చేయడం లేదు? తాము కూడా ప్రభుత్వ పెద్దలపై చాలా ఫిర్యాదులు చేశాం కదా" అని మండిపడ్డారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు, నిర్బంధాలకు భయపడి ప్రజల తరఫున చేసే పోరాటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం పోలీసులు నవీన్ రెడ్డిని ప్రత్యేక వాహనంలో బలవంతంగా తరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 8 Sept 2026 | 09:23 AM IST
Tags: