గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి మంజూరైన మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆదివారం యువజన సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ హితవు పలికారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు.
గన్నేరువరం మండలానికి మంజూరైన ఎంజేపీ పాఠశాలను పచ్చునూర్ గ్రామానికి తరలిస్తున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, యువజన సంఘాల నాయకులు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఎమ్మెల్యే కవ్వంపల్లిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలను ఎక్కడికీ తరలించే ఉద్దేశం ప్రభుత్వంకు లేదని, అది గన్నేరువరం మండలంలోనే నిర్మించబడుతుందని మండల ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తున్నామని తెలిపారు. నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత అసత్య ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని, లేనియెడల సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ముసుకు ఉపేందర్ రెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, మాతంగి అనిల్, కటకం తిరుపతి, కుమ్మెర రవీందర్ రెడ్డి, బుర్ర శ్రీకాంత్, పాకాల పరశురాములు, కూన చంద్రశేఖర్, దేశరాజు అనిల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


