గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గతంలో ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గతంలో నిర్మించతలపెట్టిన దాదాపు 30 డబుల్ బెడ్రూం ఇళ్లు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నిర్మాణం దశలోనే నిలిచిపోయాయని మండిపడ్డారు. గత పదేళ్లుగా పాడుబడి శిథిలావస్థకు చేరుకున్న ఈ ఇళ్లను పునర్నిర్మాణం చేయాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.
అనంతరం బస్టాండ్ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గన్నేరువరం నుంచి బెజ్జంకి, సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్కు, అలాగే కరీంనగర్ నుంచి హనుమాజిపల్లి మీదుగా గన్నేరువరం మండల కేంద్రానికి వచ్చే రెండు బస్సు సర్వీసులను రెండు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో కలిసి ప్రారంభించారని గ్రామస్తులు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిపివేసిన ఆర్టీసీ బస్సులను తక్షణమే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, కాంతాల అంజిరెడ్డి, బోయిని మల్లయ్య, జాలి గోపయ్య, నయీం, కూన మల్లయ్య, వేములవాడ జెలుపతి, కళ్లెం పోచయ్యతో పాటు వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు.


