హైదరాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత దంపతులు అందించిన అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, 'అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని ఎప్పుడూ వృథా చేయకూడదని' సమాజానికి చక్కటి అవగాహన కల్పిస్తూ ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకున్నారు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చే ఉద్యమకారులకు వీరు ఉచితంగా భోజనాలు, టిఫిన్లు, టీలు అందించి తమ వంతు సహకారం అందించారు.

హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి సెప్టెంబర్ 9, 2026న, ఆయన భార్య పుష్పలత సెప్టెంబర్ 10, 2026న జరిగిన విషాదకర సంఘటనలో మృతి చెందారు. వీరి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్ నుంచి సీఎం ఓఎస్డీ రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఈ విధంగా మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల స్థానికులు, ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 21 Sept 2026 | 04:38 PM IST
Tags: