షాద్నగర్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే శ్రీ వీర్లపల్లి శంకర్ గురువుల పట్ల తన భక్తిప్రపత్తులను చాటుకున్నారు. తన పాఠశాల రోజుల్లో తనకు విద్యను బోధించిన గురువులకు ఆయన ప్రత్యక్షంగా పాదాభివందనం చేసి, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. సమాజంలో ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయుడికి లభించే గౌరవప్రదమైన స్థానం మరెవరికీ దక్కదని స్పష్టం చేశారు. సమాజంలో క్రమశిక్షణతో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుడిని చూసినప్పుడు గౌరవంగా నమస్కరిస్తారని పేర్కొన్నారు. కన్న పిల్లలలాగే విద్యార్థులు ప్రయోజకులు కావాలని భావిచ్చేది ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమేనని, శిష్యులు కలెక్టర్, ఐపీఎస్ లేదా ప్రజాప్రతినిధులుగా ఎదిగినప్పుడు గురువులు ఎంతో గర్విస్తారని చెప్పారు. గతం నుంచి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బదిలీలు, ప్రమోషన్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమాజ నిర్మాతలు, సృష్టికర్తలు ఉపాధ్యాయులేనని, పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి కాంపిటీషన్ యుగంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మదన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వంగూరి గంగిరెడ్డి, జేఏసీ అధ్యక్షులు జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, నక్క బాలరాజ్, హెడ్మాస్టర్ శ్రీధర్ రెడ్డి, నందిగామ రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీధర్ కుమార్, కేశంపేట్ ఎంఈఓ రామారావు, కొత్తూరు ఎంఈఓ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


