సరూర్నగర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఎల్.బి.నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని నమ్మబలికి, నేటికీ అనేక హామీలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి, ప్రజలకు రావాల్సిన సంక్షేమ ఫలాలను వెంటనే అందించాలని కోరుతూ సరూర్నగర్ తహశీల్దార్ (ఎం.ఆర్.ఓ.) కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతు భరోసా, ప్రతి పంటకు బోనస్, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ వంటి హామీలను నెరవేర్చాలని కోరారు. అలాగే రైతు కూలీల సంక్షేమం కోసం రూ. 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఇల్లు లేని పేద ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పించడంతో పాటు జాబ్ క్యాలెండర్ను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. విద్యార్థులకు విద్యా భరోసా కల్పించి, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు పెంచిన పింఛన్లను సకాలంలో అందించాలని కోరారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, విద్యార్థులు, యువత, రైతులు తదితర అన్ని వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య, మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్ని ఎన్నికల హామీలను అమలు చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


