హైదరాబాద్: కేంద్రంలో రాహుల్ గాంధీ నల్ల టీషర్ట్ వేసుకుని పార్లమెంట్కు వెళ్లొచ్చు కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పా అంటూ గులాబీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత ధోరణిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల టీషర్ట్లు ధరించి నిరసనగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద వందలాది మంది పోలీసులతో అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
ప్రతిపక్షం గొంతును పూర్తిగా అణచివేసి, సభలో ఎవరినీ మాట్లాడనీయకుండా ఏకపక్షంగా అసెంబ్లీని నడపాలనుకోవడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని నిలదీశారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ‘ఇందిరమ్మ రాజ్యం’, ప్రజాపాలన అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రశ్నించే గొంతుకలను పోలీసు బలగాలతో ఎప్పటికీ అణచివేయలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నడపాలని చూస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.


