హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నడపడానికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో చర్చించాల్సిన వివిధ అంశాలపై బీజేపీఎల్పీ (BJLP) కార్యాలయంలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చేలా పక్కా కార్యాచరణ రూపొందించామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు ఇంకా అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు. కనీసం 15 రోజుల పాటు సభను నడపాలని తాము డిమాండ్ చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.


