ఆమనగల్లు: దసరా పండుగ సందర్భంగా ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల ప్రజల కోసం ఆమనగల్లు సర్కిల్ పోలీసులు పలు ముఖ్యమైన భద్రతా సూచనలను జేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లేవారు దొంగతనాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో లేదా ఇంట్లోని సురక్షితమైన రహస్య ప్రదేశంలో భద్రపర్చుకోవాలని, ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవడం మంచిదని తెలిపారు. తాళం వేసి ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని, కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. ప్రజల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కీచ్చారు.

ద్విచక్ర వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసి, చక్రాలకు చైన్ లాక్ వేయాలని, ఆన్‌లైన్ ద్వారా సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం, మెయిన్ డోర్ తాళాలు బయటికి కనిపించకుండా కర్టెన్లతో కవర్ చేయడం లేదా సెంట్రల్ లాక్ ఉండేలా జాగ్రత్తపడాలని తెలిపారు. ప్రయాణ సమయాల్లో ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించడంతో పాటు, రాత్రి వేళల్లో ఇంటి లోపల, బయట లైట్లు వెలిగించి ఉంచాలని చెప్పారు. అల్మారాలు, కప్‌బోర్డ్స్‌లో తాళాలు ఉంచకుండా రహస్య ప్రదేశాల్లో దాచుకోవాలని, తాము ఊరికి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే, బతుకమ్మ సంబరాలు, నిమజ్జనం సమయంలో నీటి కుంటలు, చెరువుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రావణ దహనం, జమ్మి పూజల సమయంలో ప్రజలు సంయమనం పాటిస్తూ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 8 Oct 2026 | 01:26 PM IST
Tags: