యాచారం: ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటూ అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి స్పష్టం చేశారు. బుధవారం ఆమె యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల రికార్డులను పరిశీలించడంతో పాటు, నేరుగా రోగులతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులందరూ విధుల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వేళల్లో సైతం ఎమర్జెన్సీ సేవల కోసం ఒక వైద్యుడు విధుల్లో ఉండి రోగులకు సేవలు అందిస్తారని వివరించారు. ప్రభుత్వ వైద్యులు ఎవరైనా రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే, బాధ్యులపై తక్షణ చర్యలుంటాయని, నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని హెచ్చరించారు.

ఆసుపత్రి తనిఖీ అనంతరం ఆమె స్థానిక ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాబోధన తీరును పరిశీలించారు. పాఠశాలలో నాణ్యమైన తాగునీరు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి, వెంటనే త్రాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు తహశీల్దార్ (ఎమ్మార్వో) అయ్యప్ప, గ్రామ సర్పంచ్ మస్కు అనిత శరణం, ఆసుపత్రి వైద్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 23 Sept 2026 | 08:07 PM IST
Tags: