ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరమైన సిడ్నీ పరిధిలోని స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్ మేయర్గా వికారాబాద్ జిల్లాకు చెందిన కర్రి సంధ్య రెడ్డి ఘన విజయం సాధించి మేయర్గా ఎన్నికయ్యారు. విదేశీ గడ్డపై తెలుగు మహిళ అగ్రస్థానాన్ని అధిరోహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ అరుదైన విజయం సాధించిన సంధ్య రెడ్డికి పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికైన నా మేనకోడలు కర్రి సంధ్య రెడ్డికి హృదయపూర్వక అభినందనలు" అని పేర్కొన్నారు. సంధ్య రెడ్డిది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట మండలం, మల్లారెడ్డి గూడెం అని తెలిపారు. మున్ముందు కూడా ఆమె ప్రజాసేవలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని, స్ట్రాత్ఫీల్డ్ నగర ప్రజలకు అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
తెలుగు గడ్డ నుంచి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో కీలక పదవిని దక్కించుకోవడం ద్వారా ఆమె హైదరాబాద్కు, ముఖ్యంగా చేవెళ్ల ప్రాంతానికి ఎనలేని గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. విదేశాలలోనూ మన తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న సంధ్య రెడ్డి భవిష్యత్తు ప్రయాణం విజయవంతం కావాలని పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


