వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధంలో తాము విజయం సాధించాక దేశంలో ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గ్యాలన్ ఇంధన ధర 2 డాలర్ల దిగువకు చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు అధికంగా ఉండటానికి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత మార్కెట్లు మళ్లీ స్థిరపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
“ఇరాన్‌పై మేము గెలిచాక ఇంధన ధరల్లో కూడా భారీగా కోత పడుతుంది. గ్యాలన్ ఇంధన ధర 2 డాలర్ల దిగువకు చేరుకుంటుంది. ఇదంతా త్వరలోనే జరుగుతుంది. కానీ, ఇరాన్‌కు మాత్రం ఎప్పటికీ అణ్వాయుధం దక్కదు” అని ట్రంప్ తన పోస్టులో తేల్చిచెప్పారు.
మరోవైపు, అమెరికా అగ్రనేతల వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అంతకుముందు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఎలాంటి దుస్సాహసాలకు దిగవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ ఇంధన వసతులను టార్గెట్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. తమపై జరిగే దాడులకు ప్రతిగా ప్రతీకార దాడులు ఉంటాయన్న విషయం గడచిన కాలంలోనే రుజువైందని, ఇటీవల కనుమరుగైన సైనిక స్థావరాలను అమెరికా ఒకమారు గుర్తు చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు ఎలాంటి రక్షణలు లేని స్థితిలో ఉన్నాయంటూ అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ చేసిన కామెంట్స్‌పై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ఈ మేరకు దీటుగా స్పందించారు.


