హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య ఉన్న మైత్రి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని ఎద్దేవా చేశారు. సర్వే నంబర్లతో సహా చెప్పి కేటీఆర్ బాధపడకుండా ఉండేలా ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కొత్తగా పొలిటికల్ డ్రామాలు ఆడుతూ ఎంపీలు, ఎమ్మెల్సీలను క్షేత్రస్థాయికి పంపి తమాషాలు చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు అక్కడికి వెళ్లేది హద్దులు కొలవడానికా అని ఘాటుగా ప్రశ్నించారు. ఏఐసీసీకి ముడుపులు ముట్టడం వల్లే ఇక్కడ అసలు సమస్య పక్కదారి పడుతోందని ఆరోపించారు. ముందుగా కేసీఆర్ కుటుంబంపై పూర్తిస్థాయిలో క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం

కేటీఆర్ తన సుద్దపూస మాటలు ఇకనైనా ఆపాలని బండి సంజయ్ హితవు పలికారు. పొత్తూర్ లాజిస్టిక్ పార్క్‌ను నడుపుతోంది ఎవరో కాదనీ, అది కేటీఆర్‌దేనని ఆరోపించారు. అంతేకాకుండా కొంతమంది భాగస్వాములతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నడుపుతున్నారని విమర్శించారు. ఖానాపూర్‌లో టికెట్ మార్చడానికి గల అసలు కారణం ఏంటని నిలదీశారు. ఒకప్పుడు ఆంధ్ర అడ్వాకేట్లు అంటూ విమర్శించిన కేటీఆర్.. ఇప్పుడు వారితోనే ఎందుకు సన్నిహితంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

ఉద్యోగాల పంపిణీ.. ఖైరతాబాద్ ఉపఎన్నికపై ధీమా

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను ఆయన గుర్తుచేశారు. రోజ్‌గార్ మేళా ద్వారా రెండు వందల మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద బిడ్డలకు ఉద్యోగాలు దక్కాయని హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైందని, రానున్న ఆ ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 19 Sept 2026 | 03:38 PM IST
Tags: