న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ పర్యావరణ, వాతావరణ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. 'ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్' (The Future of Environment and Climate Dynamics) పేరిట నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఈ సదస్సు కొనసాగనుంది. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో భారత్‌తో పాటు సుమారు 17 దేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

ఈ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భారత్ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. 'పీఎం సూర్యఘర్' పథకం అత్యంత విజయవంతమైందని, దేశవ్యాప్తంగా ఇప్పటికే 50 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటయ్యాయని ఆయన వెల్లడించారు. ఆధునిక వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పటికప్పుడు సరికొత్త పరిష్కారాలను అందిస్తోందన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు నెట్‌వర్క్ భారత్‌లోనే ఉందని పేర్కొన్న మోదీ, దేశంలో త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) విప్లవం రావలసి ఉందని ఆకాంక్షించారు.

కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను అనవసరంగా నిందిస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల తలసరి కర్బన ఉద్గారాలు భారత్‌తో పోలిస్తే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఎదురువుతున్న తీవ్రమైన పర్యావరణ, వాతావరణ సవాళ్లపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తున్నారు. పర్యావరణ విధానాల రూపకల్పన, వాటి అమల్లో ఉన్న లోపాలను గుర్తించడం, వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులపై నిపుణులు తమ అనుభవాలను పంచుకోనున్నారు. వాతావరణ న్యాయం, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ చట్టాలు, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిపాలన తదితర కీలక అంశాలపై సదస్సులో ప్రత్యేకంగా సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Read latest India News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 19 Sept 2026 | 03:28 PM IST
Tags: