హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ తీపి కబురు అందించింది. పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హోం శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) పరిధిలో వివిధ విభాగాల్లో మొత్తం 5,000 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

inline-img
తెలంగాణ ఆర్థిక శాఖ జారీ చేసిన అధికారిక జీవో (G.O.Ms.No.78) ప్రతి

​ఈ మెగా నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 78ను అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా ఈ 5,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపిక కోసం నోటిఫికేషన్, రాత పరీక్షల షెడ్యూల్‌ను త్వరితగతిన విడుదల చేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డును ప్రభుత్వం ఆదేశించింది.

​ఈ సరికొత్త నిర్ణయంతో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతల పూర్తి వివరాలను వెంటనే సిద్ధం చేసి బోర్డుకు సమర్పించాల్సిందిగా డీజీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST