హైదరాబాద్: ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర వాడీవేడిగా సాగాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులు ధరించి శాసనసభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసుల తీరును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టిన ఉన్నతన్యాయస్థానపు ధర్మాసనం హోంశాఖ జీపీకి నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీకి వెళ్తున్న శాసనసభ్యులను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే సర్వాధికారం కేవలం స్పీకర్కే ఉంటుందని, అంతేకాని శాసనసభ్యులపై నేరుగా పోలీసులు చర్యలు తీసుకోవడానికి వీలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, ఆందోళన సమయంలో మహిళా శాసనసభ్యులపై దురుసుగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన పోలీసులను తక్షణమే గుర్తించాలని హోం శాఖను హైకోర్టు ఆదేశించింది. బాధ్యులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించిన కోర్టు.. ఈ పూర్తి ఘటనపై సమగ్ర నివేదికను తమకు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.


