హైదరాబాద్: ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ (TSRTC), హైదరాబాద్ మెట్రో రైల్ (HMR) సంయుక్తంగా ఉమ్మడి పాస్‌లను (Common Passes) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలోనే మెట్రో - ఆర్టీసీ ఉమ్మడి పాస్‌లను వీలైనంత త్వరగా జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం నెలవారీ (Monthly), రోజువారీ (Daily) పాస్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసి, మెట్రో అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. తాము ఉమ్మడి పాస్‌ల జారీకి సాంకేతిక పరంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే ఈ పాస్‌ల విధానాన్ని అమలు చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఉద్ఘాటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మెట్రో రైలు సేవలను స్వయంగా పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి హంగుబాట్లు లేకుండా సాధారణ ప్రయాణికుడిగా మెట్రో రైలులో ఆయన ప్రయాణించారు. బేగంపేట్ నుంచి ప్యారడైజ్ వరకు మెట్రోలో ప్రయాణిస్తూ.. ప్రయాణికులకు అందుతున్న సేవలు, అక్కడ కల్పిస్తున్న వసతులను నిశితంగా పరిశీలించారు. ఆయా స్టేషన్లలోని సౌకర్యాలు, నిర్వహణ తీరుపై అధికారులతో ఆరా తీశారు. ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకల నిర్వహణను స్వయంగా పరిశీలించి, ప్రజలకు అందుతున్న సేవల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మెరుగైన, సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై అధికారులతో చర్చించారు. మెట్రో సేవల నాణ్యతను ఎల్లప్పుడూ మెరుగుపరుస్తూ ఉండాలని ఆదేశించారు. ప్రజల నిజమైన అవసరాలు, సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే ఈ ఆకస్మిక పర్యటన ముఖ్య ఉద్దేశమని సీఎస్ వివరించారు. కాగా, సీఎస్ వెంట మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ ఎండీ అజిత్ రెడ్డి ఉన్నారు.


