హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈహెచ్‌ఎస్ (EHS) అమల్లో ఎలాంటి రాజీ పడేది లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈహెచ్‌ఎస్ అమలు తీరుపై ఆదివారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అధికారులతో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు డిపెండెంట్ల ఆరోగ్య భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పూర్తి మానవీయ కోణంలో పరిష్కరించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగులు ఎలాంటి ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొకుండా వారికి పక్కాగా ఆరోగ్య భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈహెచ్‌ఎస్ విధివిధానాలను రూపకల్పన చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 354 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన మరిన్ని ఆస్పత్రులను డీమ్డ్ ఎంప్యానెల్డ్ విధానంలో కొత్తగా చేర్చామని వివరించారు. హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈహెచ్‌ఎస్ పథకాన్ని ఎవరూ అషామాషీగా తీసుకోవద్దని హుకుం జారీ చేస్తూ, ఈ పథకం సమర్థవంతమైన అమలుకు ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు మరియు ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఆయన, ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం పూర్తిగా కమిటెడ్‌గా ఉందని పునరుద్ఘాటించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 10:39 PM IST
Tags: