హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (BJP), బీజేపీ యువమోర్చా (BJYM) పిలుపునిచ్చిన "ఫీజు బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర శాసనసభ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొని, విద్యార్థుల పక్షాన నిలబడి ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు రూ. 15,000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను అణచివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడిందని మొద్దు లచ్చి రెడ్డి ధ్వజమెత్తారు. అందులో భాగంగానే లచ్చి రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా లచ్చి రెడ్డి మాట్లాడుతూ.. "ప్రభుత్వం అరెస్టులతో మా గొంతు నొక్కలేరు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పెండింగ్ బకాయిలన్నీ పూర్తిగా విడుదల చేసేంత వరకు మా పోరాటం ఆగేది లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చేసే ఆందోళనలను పోలీసు బలగాలతో అణచివేయాలని చూడటం దుర్మార్గం" అని స్పష్టం చేశారు. ఈ అక్రమ అరెస్టులను బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించగా, అరెస్టయిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 05:22 PM IST
Tags: