షాద్‌నగర్: షాద్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుడు, విప్లవ వీరుడు భగత్‌సింగ్ 118వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయనో అర్పించిన ప్రాణత్యాగాలను నాయకులు భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ షాద్‌నగర్ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ ఆశయాలను నేటి విద్యార్థి లోకానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భగత్‌సింగ్ కేవలం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుడు మాత్రమే కాదని, సమానత్వం, సామాజిక న్యాయం, శాస్త్రీయ ఆలోచనలు మరియు దోపిడీ లేని నూతన సమాజం కోసం కలలు కన్న గొప్ప విప్లవకారుడని కొనియాడారు. నేటి విద్యార్థి యువత భగత్‌సింగ్ జీవిత చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు ఆయన ఆలోచనలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, సామాజిక సమానత్వం కోసం విద్యార్థులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. భగత్‌సింగ్ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం విద్యార్థి ఉద్యమాలు నిరంతరం శ్రమించాలని, ఆయన త్యాగాలు, ఆశయాలను రాబోయే తరాలకు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షుడు ఆదిల్, నాయకులు రామ్‌చరణ్, శివ, మనోజ్, రాహుల్, విష్ణు, చరణ్, జస్వంత్, మహేందర్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 28 Sept 2026 | 03:30 PM IST
Tags: