ఆధ్యాత్మిక డెస్క్: చాలామందికి ఆదివారం (Sunday) అంటే ఆలస్యంగా నిద్రలేవడం, బాధ్యతలకు దూరంగా ఉండటం, కేవలం టీవీలు, మొబైల్ స్క్రీన్లకే పరిమితమవ్వడం ఒక అలవాటుగా మారిపోయింది. ఆదివారాన్ని ఒక "ఫన్ డే"గా భావిస్తూ విలాసవంతమైన విశ్రాంతికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇది ఒక పెద్ద పొరపాటని భారతీయ ఆధ్యాత్మిక తత్వశాస్త్రం చెబుతోంది. ఆదివారం అనేది బద్ధకంతో కాలం గడపడానికి కాదు.. సూర్య భగవానుడి నుంచి అపారమైన శక్తిని, క్రమశిక్షణను పొంది 'కర్మయోగం' వైపు అడుగులు వేయాల్సిన రోజు.
సూర్యదేవుడు - పరమ కర్మయోగి
భారతీయ సాంప్రదాయంలో ఆదివారాన్ని (రవివారం) సూర్య భగవానుడికి అంకితం చేశారు. పురాణాల ప్రకారం ఆది-నారాయణుడి నుంచి కర్మయోగ మార్గాన్ని స్వీకరించిన తొలి విశ్వశక్తి సూర్యుడే.. యంత్రాలు చల్లబడటానికి విరామం కావాలి, మనుషులకు నిద్ర కావాలి. కానీ, సూర్యుడు ఎన్నడూ తన విధులకు విరామం ప్రకటించడు. సూర్యుడు ప్రతిఫలం ఆశించకుండా కేవలం ఇవ్వడమే పరమావధిగా నిరంతరం ప్రకాశిస్తాడు. ఆయన ఒక్క రోజు సెలవు తీసుకున్నా సృష్టి అంతమౌతుంది. అందుకే సూర్యుడిని పరమ కర్మయోగిగా కొలుస్తారు.
ఆదివారం బద్ధకం.. శక్తిని హరిస్తుంది
ఆదివారం రోజున సూర్యుడి ప్రభావం (మహా తేజస్వి రూపం) భూమిపై అత్యంత బలంగా ఉంటుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేవకుండా పడకపైనే గడపడం వల్ల సూర్యరశ్మి ద్వారా వచ్చే ప్రాణశక్తిని కోల్పోతాము. వేకువజామున సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల హార్మోన్లు క్రమబద్ధీకరించబడటమే కాకుండా, మానసిక స్పష్టత పెరుగుతుంది. ముఖ్యంగా మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యారాధన చేయడం వల్ల జడత్వం వీడి ఉన్నత శిఖరాలకు చేరుకునే శక్తి లభిస్తుంది.
సంప్రదాయ సూర్య ధ్యాన విధి (Surya Dhyan Vidhi)
ఆదివారం ఉదయం నిరంతర క్రమశిక్షణతో చేయాల్సిన శాస్త్రీయ ధ్యాన ప్రక్రియ
సమయం & ఆసనం: సూర్యోదయం తర్వాత 30-45 నిమిషాల్లోపు టెర్రస్ లేదా బాల్కనీ లాంటి బహిరంగ ప్రదేశంలో ఒక మత్ (చాప) వేసుకుని, వెన్నుపూస తిన్నగా ఉంచి కూర్చోవాలి.
ఆజ్ఞా చక్రంపై దృష్టి: రెండు కనుబొమ్మల మధ్య భాగమైన 'ఆజ్ఞా చక్రం'పై నెమ్మదిగా దృష్టిని కేంద్రీకరించాలి. ఇది మానసిక స్పష్టతను ఇస్తుంది.
సూర్య గుణాల ఆవాహన: సూర్యుని నుంచి తేజస్సు, ఓజస్సు (శక్తి), ఆరోగ్యం మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు.. మీలోని కోపం, బద్ధకం, అహంకారం కాలిపోతున్నట్లు ఊహించుకోవాలి.
మంత్ర జపం: కళ్లు మూసుకుని ప్రశాంతంగా "ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః" సూర్య మంత్రాన్ని 108 సార్లు జపించాలి
సూర్య అర్ఘ్యం: రాగి పాత్రలో నీటిని తీసుకుని, అందులో ఎర్రటి పువ్వులు, ఎర్ర చందనం కలిపి సూర్య దేవునికి అర్ఘ్యం (నీటి సమర్పణ) ఇవ్వాలి.
ముగింపు పూజ: ఆ తర్వాత నెయ్యి దీపం, గుగ్గిల ధూపం వెలిగించి.. నువ్వుల లడ్డూ లేదా ఏదైనా సాధారణ తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఈ వార్తా చదవండి:నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు వీరే
ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు
క్రమశిక్షణతో కూడిన సూర్యారాధన వల్ల కేవలం పూజా ఫలమే కాకుండా అంతర్గత మార్పులు సాధ్యమవుతాయి. మానసిక బలహీనతలు, జడత్వం తొలగిపోతాయి. భయం, అహంకారం వంటి అంతర్గత శత్రువులపై విజయం లభిస్తుంది. సాధారణ మానవుడు సైతం లక్ష్య ఆధారిత, సమాజానికి ఉపయోగపడే 'మహామానవుడు'గా మారతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
సందేశం: "జంతువులు తమ కోసం జీవిస్తాయి, మనుషులు ఇతరుల కోసం జీవిస్తారు. కానీ నిస్వార్థంగా జీవించేవాడు దైవస్వరూపుడు అవుతాడు" అనే నానుడిని గుర్తుంచుకుని.. ఈ ఆదివారం నుండి బద్ధకానికి స్వస్తి చెప్పి, వేకువజామునే లేచి కర్మయోగిగా మారేందుకు ప్రయాణం ప్రారంభించండి.


