హఫీజ్పేట్: రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళను ఇష్టానుసారంగా కొట్టి, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారిన ఈ వీడియోపై వెంటనే విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మహిళపై అతి దారుణంగా, దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి రైల్వే సిబ్బంది కాదని.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన హోంగార్డు అని గుర్తించినట్లు స్పష్టం చేశారు.
హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించే నిమిత్తం తెలంగాణ పోలీస్ శాఖ నుంచి సదరు హోంగార్డును డిప్యూటేషన్పై పంపినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తిచేసిన అనంతరం, నిందితుడిని తక్షణమే తిరిగి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు సరెండర్ చేసినట్లు పేర్కొంది. అతడిపై అవసరమైన కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖకు అప్పగించినట్లు స్పష్టం చేస్తూ.. ఈ మేరకు దక్షిణ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పూర్తి వివరాలతో వివరణ ఇచ్చింది.
హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఓ మహిళను వ్యక్తి దారుణంగా కొడుతూ, జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ వీడియోలు విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో నెటిజన్లు, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే తొలుత ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి రైల్వే పోలీస్ కానిస్టేబుల్ అయి ఉంటాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరకు దక్షిణ మధ్య రైల్వే స్పందించి అసలు నిజాలను వెల్లడించడంతో ఈ ఉదంతంపై స్పష్టత వచ్చింది.


