షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో తీవ్ర విషాదం, దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో 70 ఏళ్ల వృద్ధుడు భాగం పోచయ్యను ఆయన కుమారుడు భాగం మల్లేష్ దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అర్ధరాత్రి సమయంలో నిందితుడు గనేటు రాయితో తలపై బలంగా కొట్టడంతో పోచయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మల్లేష్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇప్పటికే కుటుంబానికి చెందిన కొంత భూమిని విక్రయించి ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన భూమిని కూడా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని తండ్రి పోచయ్యపై కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, మిగిలిన భూమిని కుమారుడి పేరుపై రాస్తే భవిష్యత్తులో అతని ఇద్దరు కుమారుల (మనుమల) జీవనం అగమ్యగోచరంగా మారుతుందనే ఉద్దేశంతో పోచయ్య ఆ భూమిని తన పేరుపైనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే భూమిని తన పేరుపై చేయడం లేదనే కక్షతో తండ్రితో మల్లేష్ తరచూ గొడవపడేవాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి తండ్రి నిద్రపోతున్న సమయంలో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 8 Oct 2026 | 01:08 PM IST
Tags: