సిరిసిల్ల: గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సిరిసిల్ల ప్రాంతం అభివృద్ధి చెందకపోగా, అది కాస్తా 'ఉరిసిల్ల'గా మారిపోయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మునుపటి పాలకులపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.
చేనేతలను, గల్ఫ్ కార్మికులను పట్టించుకోలేదు..
ఇక్కడ చేనేత కళను నమ్ముకుని లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నప్పటికీ, గత పాలకులు ఆ కుటుంబాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల ప్రజల సంక్షేమం గురించి కేటీఆర్ ఏనాడైనా ఆలోచించారా..? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం, తెలంగాణ మొత్తాన్ని నిలువునా దోచుకుందని మండిపడ్డారు. ఆ కుటుంబానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్లో తెలంగాణ కార్మికులు మరణిస్తే.. కనీసం వారి మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని, గల్ఫ్ బాధితుల కష్టాలు వారికి ఎన్నడూ పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గల్ఫ్ వలసలను నివారించడంలో, ఆ కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ ఎందుకు విఫలమయ్యారని నిలదీశారు.
కేటీఆర్ గడీలను నేలమట్టం చేస్తాం..
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు దక్కాయని, కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాత్రం తెలంగాణ కోసం నిస్వార్థంగా కొట్లాడిన అసలైన పోరాట యోధులకు సముచిత పదవులు ఇచ్చామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో సిరిసిల్లలో కేటీఆర్ గడీలను పూర్తిగా నేలమట్టం చేసి, ఈ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


