షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పూర్తిగా నివారించి ప్రయాణికులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు కొత్త ట్రాఫిక్ సీఐ ఎస్. వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం రామకృష్ణ థియేటర్ నుంచి ప్రధాన చౌరస్తా వరకు ఉన్న రోడ్డు మార్గంలో కూరగాయల దుకాణాలు, చిరు వ్యాపారాలు, ప్రధాన వాణిజ్య షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తున్న తీరును, దానివల్ల వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. దుకాణదారులు తమ సామగ్రిని, కూరగాయల బండ్లను రోడ్లపైకి చాపకుండా తమ షాపుల హద్దుల్లోనే వ్యాపారం నిర్వహించుకోవాలని గట్టిగా ఆదేశించారు. రోడ్లను ఆక్రమించడం వల్ల నిత్యం తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు సైతం నిలిచిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అనంతరం సీఐ ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా స్పందించి తమ దుకాణాల పరిధిలోనే వ్యాపారాలు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు స్థానిక వ్యాపారులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 14 Oct 2026 | 09:05 PM IST
Tags: