వనస్థలిపురం: పురిటి నొప్పులతో అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీకి వైద్యం అందించకుండా వెనక్కి పంపేసిన అమానుష ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో వేరే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడింది. బాధితుల కథనం ప్రకారం.. పురిటి నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆదివారం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తీసుకెళ్లారు.

అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అత్యవసర సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు వైద్యులు.. కనీసం పరీక్షలు చేయకుండా కేవలం ‘రిపోర్టులు లేవనే’ సాకుతో ప్రసవం చేసేందుకు నిరాకరించారు. వేరే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని బాధ్యతారహితంగా సూచించారు. కుటుంబ సభ్యులు ఎంతగా వేడుకున్నా ఆసుపత్రి సిబ్బంది కనికరించకపోవడంతో, చేసేది లేక వేరే మార్గం లేక అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే గర్భిణీ పరిస్థితి పూర్తిగా విషమించడంతో మార్గమధ్యలోనే అంబులెన్స్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అత్యవసర సమయంలోనూ మానవత్వం లేకుండా వైద్యం అందించకుండా వెనక్కి పంపడంపై బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గర్భిణీకి లేదా పుట్టిన పసికందుకు ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించేవారని వారు నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణీ ప్రాణాలతో చెలగాటలాడిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 01:19 PM IST
Tags: