వెబ్ డెస్క్: ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ఘటన సమయంలో కాక్‌పిట్‌లో ఎదురైన క్లిష్ట పరిస్థితులను కెప్టెన్ ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన చూపిన అద్భుతమైన ధైర్యసాహసాలను మోదీ మరోసారి ప్రశంసించారు.

ఈ సందర్భంగా మచ్చార్‌ మాట్లాడుతూ.. "ఆ సమయంలో నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. కానీ నేను ధైర్యం చూపకపోతే 170 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతారని అర్థమైంది" అని ప్రధానికి తెలిపారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపును తెరవగలిగారు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశం లభించింది.

భారత్ గర్విస్తోంది: ప్రధాని మోదీ

అంతకుముందు ఎక్స్‌ వేదికగా స్పందించిన మోదీ.. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌‌ను ‘‘హీరో’’గా అభివర్ణించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, పట్టుదలను కొనియాడారు. ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లోనూ మోదీ ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. "ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పినట్లుగా.. ఒక భారతీయుడు 9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్నారు" అని పేర్కొన్నారు. కాగా, కెప్టెన్ స్మిత్‌ మచ్చార్‌కు వాణిజ్య విమానయాన రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉండగా, ఫ్లైదుబాయ్‌లో చేరకముందు 11 ఏళ్ల పాటు స్పైస్‌జెట్‌లో పనిచేశారు.

Read latest India News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 2 Oct 2026 | 01:43 PM IST
Tags: