హైదరాబాద్: మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టీజేఎస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ‘ఛలో లోక్‌భవన్’ కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, ఇండియా కూటమి రాష్ట్ర నేతలు పాల్గొని ఆందోళనకు దిగగా.. లోక్‌భవన్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులను బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సహా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్లను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా లోక్‌భవన్ వద్ద మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అధికారంలో ఉండటానికి మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఖూనీ చేస్తున్నారని, దేశంలో యథేచ్ఛగా ఓట్ల చోరీ జరుగుతోందని మండిపడ్డారు. బీహార్, పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణను బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కుమ్మక్కై 92 లక్షల ఓట్లు తొలగించిందని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా వల్ల గత 12 ఏళ్లలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. సీఈసీని తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నట్లు తెలిపారు.


