ఫిల్మ్ డెస్క్: హీరో నానికి 'నేచురల్ స్టార్' అనే బిరుదు ఆయనకు సరిగ్గా సరిపోతుంది. సహజంగా, మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ ఉండే నాని.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అనతికాలంలోనే ఆకట్టుకోగలిగారు. గత ఐదు సంవత్సరాలుగా నాని సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా, జనాన్ని మాత్రం థియేటర్లకు రప్పించడంలో ఆయన సఫలమవుతున్నారు. అయితే నానికి ఇప్పటివరకు ‘ఫ్యామిలీ హీరో’ ఇమేజ్ ఉందే తప్ప, పూర్తిస్థాయి మాస్ హీరోగా ఇంకా మార్కులు పడాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ ప్రయోగం

‘ద ప్యారడైజ్’ (The Paradise) సినిమా బంపర్ హిట్ అయి కనీసం రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తేనే నానికి సరైన మాస్ హీరో ఇమేజ్ దక్కుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ‘ద ప్యారడైజ్’ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 200 కోట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు వంద కోట్ల బడ్జెట్‌తో నాని చిత్రాలేవీ తెరకెక్కలేదు. అలాంటిది ఏకంగా రూ. 200 కోట్లతో సినిమా అంటే ఆశ్చర్యం కలగకమానదు. పైగా నాని సినిమాలేవీ ఇంతవరకు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను చూసి ఎరుగవు. అందువల్ల ‘ద ప్యారడైజ్’ చిత్రం సినీ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచుతోంది.

నాని కెరీర్ గ్రాఫ్, మాస్ ఇమేజ్

నాని కెరీర్‌ను పరిశీలిస్తే ‘అలా మొదలైంది’తో తొలి హిట్ అందుకున్న ఆయన.. ‘పిల్లజమీందార్’, ‘ఈగ’, ‘భలేభలే మగాడివోయ్’, ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. అయితే ‘దసరా’, ‘హిట్ 3’ మినహాయిస్తే మిగతా అన్ని చిత్రాల్లోనూ ఆయన ఫ్యామిలీ హీరోగానే అలరించారు. ‘దసరా’ చిత్రంలో మాస్ లుక్‌తో మెప్పించిన నానిపై ఉన్న నమ్మకంతోనే ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతున్నారు.

ఇప్పటివరకు నాని కెరీర్‌లో హిట్ అయిన సినిమాలన్నీ పెట్టుబడికి తగ్గ రాబడిని అందించాయి తప్ప, భారీ బ్లాక్‌బస్టర్ల స్థాయిని తాకలేదు. నాని మూవీస్‌లో ‘దసరా’ (Dasara) ఒక్కటే రూ. 150 కోట్ల దాకా వసూళ్లను సాధించింది. ఈ కోణంలో చూస్తే ‘దసరా’ కాంబినేషన్ అయిన నాని - డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజ్ ‘ద ప్యారడైజ్’కు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అప్పట్లో డివైడ్ టాక్ వచ్చినా ‘దసరా’ విజయవంతమైన రీతిలోనే, ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ కూడా ఆశించిన వసూళ్లను రాబడితే నాని నిజంగానే 'మాస్' హీరోల జాబితాలో చేరిపోతాడని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫలితంపై త్వరలోనే స్పష్టత రానుంది.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Sept 2026 | 11:36 AM IST
Tags: