ఫిల్మ్ డెస్క్: అభిరామ్ నాయుడు దర్శకత్వంలో.. అన్నాపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని, వంశీధర్ గౌడ్ (వంశీ), రవి శివతేజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేడీ-ఓరియెంటెడ్ మూవీ ‘హ్యాపీ జర్నీ’ (Happy Journey). ప్రముఖ ప్రొడ్యూసర్ బాలాజీ గుట్ట నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూరప్ ట్రిప్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో పరిశీలిద్దాం.
కథా నేపథ్యం
లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకున్న వివిధ నేపథ్యాలు ఉన్న మహిళలు సావిత్రి (అన్నాపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిష అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైన), విహాన (రూప శ్రీనివాస్) ఒకే ట్రిప్‌కు బయలుదేరుతారు. 'గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్' నడిపే గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ) ఈ ట్రిప్‌కు గైడ్లుగా వ్యవహరిస్తారు. సరదాగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఊహించని భావోద్వేగాలు, కుటుంబ పునఃసమాగమం వైపు ఎలా మళ్లింది? అసలు ఈ ప్రయాణంలో వీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటి? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
‘హ్యాపీ జర్నీ’ చిత్రానికి మంచి ఉద్దేశం ఉంది. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో వచ్చే కొన్ని సరదా క్షణాలు, వంశీ మరియు హీరోయిన్ల మధ్య జరిగే సంభాషణలు ముఖంపై చిరునవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. నటీనటుల విషయానికి వస్తే.. సీనియర్ నటి అన్నాపూర్ణమ్మ మోడర్న్ అవతారంలో అదరగొట్టగా, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైన తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వంశీ తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూ, రవి శివతేజతో మంచి కెమిస్ట్రీ పండించారు.
అయితే, స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరకపోవడంతో సినిమా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. అనవసరమైన సన్నివేశాలు ఉండటం వల్ల కథలో ఫ్లో దెబ్బతింది. అలాగే మహిళా పాత్రల వ్యక్తిగత సమస్యలను మరింత లోతుగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఎమోషనల్ డెప్త్ మరింత ఎక్కువగా ఉండేది. ఫన్ అండ్ ఎమోషన్స్ మధ్య బ్యాలెన్స్ మిస్ అవ్వడం, కొన్ని సన్నివేశాలు తొందరపాటుగా అనిపించడం మైనస్‌గా మారాయి.
సాంకేతికంగా చూస్తే.. సుబ్రమణ్యం మణిగందన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. యూరప్ లొకేషన్లను తెరపై చాలా అందంగా ఆవిష్కరించారు. శేఖర్ చంద్ర సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
ముగింపు
మంచి పాయింట్, కొన్ని నవ్వులు పంచే సన్నివేశాలతో సాగిన ‘హ్యాపీ జర్నీ’.. అన్ ఈవెన్ స్క్రీన్ ప్లే వల్ల పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేకపోయింది. ఎమోషనల్ కనెక్షన్ సరిగ్గా వర్కౌట్ కాకపోయినా, నటీనటుల మంచి నటన మరియు విజువల్స్ కోసం ఈ సినిమాను ఒకసారి సరదాగా చూడవచ్చు.
రేటింగ్: 3 / 5


