హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు విధ్వంస నిరసన కార్యక్రమం అత్యంత హోరాహోరీగా సాగింది. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముసలవ్వను తన భుజాలపై ఎత్తుకుని ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన తెలిపి అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో అన్నదాతలు అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణను దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన కొనియాడారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సాగునీరు, ఎరువులతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను ఆదర్శంగా నిలిపారని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప మరేమీ లేవని మల్లారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతీ ఒక్క వర్గాన్ని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన ఈ ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వాన్న వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 3 Sept 2026 | 11:25 PM IST
Tags: