వీపనగండ్ల: వీపనగండ్ల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పనుల పురోగతి, పెండింగ్ సమస్యలు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వీపనగండ్ల మండలానికి 375 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా, ఇప్పటివరకు 321 మంది లబ్ధిదారులను గుర్తించారని, ఇంకా 54 మంది లబ్ధిదారుల ఎంపిక పెండింగ్‌లో ఉందని అధికారులు మంత్రికి వివరించారు. మొదటి విడత లబ్ధిదారుల ఎంపికే ఇంకా పూర్తికాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీ సమావేశాలు నిర్వహించి, రెండు మూడు రోజుల్లోగా పెండింగ్‌లో ఉన్న 54 మంది లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఎంపిక అనంతరం గెజిటెడ్ అధికారుల వెరిఫికేషన్, శాంక్షన్ ప్రక్రియను కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. మొదటి విడతలో లబ్ధిదారులను గుర్తించి శాంక్షన్ చేయకుండా ఇళ్లను పెండింగ్‌లో ఉంచినట్లయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొరపాటుగా ఎల్-3 జాబితాలో నమోదైన అర్హులైన లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శులు గుర్తించి సంబంధిత ఎంపీడీవోలకు వివరాలు అందించాలని సూచించారు. హౌసింగ్ లాగిన్‌లోని ఎల్-3 టూ ఎల్-1 మాడ్యూల్ ద్వారా అర్హులైన వారి ప్రతిపాదనలను వారం రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌కు పంపాలని ఆదేశించిన మంత్రి.. జిల్లాస్థాయిలో పరిష్కరించగల అంశాలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు.

అనంతరం గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదల, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, హౌసింగ్, పంచాయతీ రాజ్ - గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, ఐసీడీఎస్, దేవాదాయ, భూసేకరణ, రెవెన్యూ శాఖల పరిధిలోని వివిధ అంశాలపై మంత్రి సమీక్షించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్, సాగునీరు, రహదారులు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 31 Aug 2026 | 07:52 PM IST
Tags: