కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని జై భవాని వైన్స్‌లో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఉదయం 7 గంటల నుంచి 7:30 గంటల మధ్య ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఉదయం 7:40 గంటల ప్రాంతంలో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైన్స్‌లోని భారీ ఎత్తున మద్యం బాటిళ్లు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.

కోట్ల రూపాయల ఆస్తి నష్టం

జై భవాని వైన్స్‌లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన మద్యం స్టాక్, ఇతర సామాగ్రి ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. అయితే పూర్తి స్థాయి అధికారుల పరిశీలన, విచారణ అనంతరం అసలైన ఆస్తి నష్టం ఎంతనేది స్పష్టత రానుంది. ఈ వైన్స్ షాద్‌నగర్‌కు చెందిన నవీన్‌కు చెందినదిగా సమాచారం.

ప్రమాద విషయం తెలుసుకున్న సర్పంచ్ సరికొండ పాండు, వార్డు సభ్యులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా? వైన్స్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 19 Sept 2026 | 12:46 PM IST
Tags: