హైదరాబాద్: గౌరవ శాసనసభ స్పీకర్‌పై అత్యంత హేయంగా, అవమానకరంగా, కించపరుస్తూ శాసనమండలి సభ్యుడు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సభకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణ పరిధిలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడిన అంశాన్ని అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేవనెత్తగా, దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ గారిపై దుర్భాషలాడిన సదరు సభ్యుడిని చట్టసభ నుంచి తక్షణమే అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

“ఇది అత్యంత తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతి గారిపై అంత అభ్యంతరకరమైన భాషా ప్రయోగం చేయడం దారుణం. సభాపతి గారిని, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ మాట్లాడారు. ఇది కేవలం ఒక వర్గానికి లేదా దళితులకు జరిగిన అవమానం కాదు.. యావత్ తెలంగాణ సమాజానికి, సభలోని అందరికీ జరిగిన తీవ్రమైన అవమానం” అని ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తెచ్చారు. స్పీకర్ గారిపై అత్యంత హేయంగా దుర్భాషలాడిన సభ్యుడిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని శాసనమండలి చైర్మన్ గారిని కోరతామని చెప్పారు. “శాసనసభ స్పీకర్ గారిపై అత్యంత హేయంగా మాట్లాడిన సంఘటన మన నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి తగిలిన గాయం. తెలంగాణకు ఇది ఒక చీకటి రోజు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అడ్డగోలుగా ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకునే వారికి చట్టపరంగా గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అంశం కేవలం ఒక శాసనసభ్యుడికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదని, రాజకీయాలకు అతీతంగా సభలోని ప్రతి ఒక్క సభ్యుడు దీనిపై తీవ్రంగా స్పందించాలని పిలుపునిచ్చారు. “స్పీకర్ గారి తల్లిని అవమానించేలా మాట్లాడటం మనందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించి, ఇలాంటి దుర్మార్గపు పోకడలను కఠినంగా నియంత్రించాలి” అని కోరారు. భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఏ చట్టసభల్లోనూ ఇంతటి దుర్మార్గమైన, హేయమైన సంఘటన జరగలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతటి నీచమైన మాటలు ఎవరూ మాట్లాడలేదని మండిపడ్డారు. ఈ సంప్రదాయం మంచిది కాదని, దీన్ని క్షమించి ఊరుకుంటే భవిష్యత్తులో చట్టసభల పట్ల ఏమాత్రం గౌరవం మిగలదని హెచ్చరించారు. ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించి సమాజానికి ఒక మంచి కఠిన సందేశం పంపించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 05:15 PM IST
Tags: