న్యూఢిల్లీ: తమిళనాడులోని రెండు, పుదుచ్చేరిలోని ఒక అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మూడు స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు స్థానాలకు కలిపి అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని తట్టాంచావడి నియోజకవర్గానికి అక్టోబర్ 6న ఉపఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్య్రర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా, 19వ తేదీని నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా సీఈసీ పేర్కొంది. తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం స్థానాలు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ కావడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, పుదుచ్చేరిలో రెండు స్థానాల్లో గెలుపొందిన సీఎం రంగస్వామి.. మంగళం స్థానాన్ని కొనసాగిస్తూ, తట్టాంచావడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది.

అయితే, తమిళనాడులో మరో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, ఆయా నియోజకవర్గాల గురించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుత షెడ్యూల్‌లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. తిరుచ్చి ఈస్ట్, పెరుందురై, అంబాసముద్రం, విరాలిమలై, కరూర్ స్థానాలపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటంతో వాటి ఉప ఎన్నికలు తాత్కాలికంగా ఆలస్యం కానున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల ఫలితాలను, అభ్యర్థుల విజయాలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడం, వాటిపై విచారణ కొనసాగుతుండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు కేసులు పూర్తిగా పరిష్కారమైన తర్వాతే ఆ మిగిలిన ఐదు స్థానాలపై ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Read latest India News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 7 Sept 2026 | 10:53 PM IST
Tags: