హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో అత్యంత ఆధునిక హంగులతో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్ను సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, దివంగత నేత స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు గారి పేరును ఈ నూతన సెంట్రల్ హాల్కు నామకరణం చేశారు. ఈ ప్రాంగణ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖులంతా కలిసి మాజీ స్పీకర్ శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, మంత్రులతో కలిసి నూతన సెంట్రల్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాల వేళ సభ్యులు పరస్పరం కలుసుకునేందుకు, చర్చించుకునేందుకు ఈ నూతన హాల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నేతలు అభిప్రాయపడ్డారు.


