షాద్నగర్: విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసేందుకు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయమని బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కక్కునూరు వెంకటేష్ గుప్తా తీవ్రంగా ఖండించారు. షాద్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని తన స్వగృహంలో ఉన్న వెంకటేష్ గుప్తాను సోమవారం ఉదయం స్థానిక పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సిన సుమారు రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందక వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేస్తున్న నాయకులను అక్రమ అరెస్టులతో అడ్డుకోవాలని చూడటం ప్రభుత్వ భయానికి నిదర్శనమని, ముందస్తు అరెస్టులతో విద్యార్థుల ఉద్యమాలను ఎప్పటికీ ఆపలేరని వెంకటేష్ గుప్తా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


