అమరావతి: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, పరిశీలకులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు అలాగే సీనియర్ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ డిన్నర్ మీట్ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, అనుసరించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎన్నికల సమన్వయం, మిత్రపక్షాలతో కలిసి పనిచేసే విధానంపై నేతలతో సీఎం చంద్రబాబు కూలంకషంగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫార్ములాతో పాటు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా అక్టోబర్లో ఎన్నికలు కచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అందుకు పార్టీ శ్రేణులను పూర్తిగా సమాయత్తం చేయాలని స్పష్టం చేశారు. పరిశీలకులంతా తక్షణమే తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి పనులను పర్యవేక్షించాలని, అందరూ సమన్వయంతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబు కఠిన ఆదేశాలు జారీ చేశారు.


