ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన శాలరీ అకౌంట్స్ ఖాతాదారులకు సంబంధించిన ఏటీఎమ్ నిబంధనలను సవరించింది. ఇతర బ్యాంకు ఏటీఎమ్ల ద్వారా ఖాతాదారులు పొందే ఉచిత లావాదేవీల సంఖ్యను గతంలో ఉన్న 10 నుంచి తాజాగా 5కి తగ్గించింది. ఒకవేళ ఈ నిర్ణీత పరిమితిని మించి లావాదేవీలు నిర్వహించినట్లయితే ఖాతాదారుల అకౌంట్ నుంచి అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది.
గతంలో ఎస్బీఐ శాలరీ అకౌంట్స్ కలిగిన వినియోగదారులు ఇతర బ్యాంకు ఏటీఎమ్ల నుంచి నగదు తీసుకోవడం లేదా ఇతర నగదు రహిత సేవలను పొందడం కోసం 10 లావాదేవీల వరకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఉపయోగించుకునేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ ఉచిత వెసులుబాటు కేవలం 5 లావాదేవీలకే పరిమితం కానుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఏటీఎం కేంద్రాల నుంచి ఐదుసార్ల కంటే ఎక్కువ సార్లు నగదు విత్డ్రా చేసినట్లయితే ప్రతి లావాదేవీకి రూ. 23తో పాటు జీఎస్టీ చార్జీలను అదనంగా వసూలు చేస్తారు. అలాగే పరిమితిని మించి చేసే ప్రతి నగదు రహిత లావాదేవీపై రూ. 11 చార్జీతో పాటు జీఎస్టీ వర్తిస్తుందని వెల్లడించారు. అయితే ఎస్బీఐ ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎమ్ సేవలను మాత్రం ఎలాంటి పరిమితులు లేకుండా అపరిమితంగా వినియోగించుకోవచ్చని బ్యాంకు స్పష్టం చేసింది.


