ఎడ్యుకేషన్ డెస్క్: ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు 12వ తరగతి అనంతరం ఉన్నత విద్యనభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టాప్ క్లాస్’ ఉపకార వేతనాల పథకం కింద దరఖాస్తులను ఆహ్వానించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 2,000 మంది విద్యార్థులను ఈ పథకానికి ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ పథకం కింద విద్యార్థుల విద్యా ఖర్చులు, పుస్తకాలు, స్టేషనరీ, ల్యాప్‌టాప్ తదితర అవసరాల కోసం మొదటి ఏడాదికి రూ. 86 వేల చొప్పున, ఆ తర్వాత ప్రతి ఏడాదికి రూ. 41 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన వారికి ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర ఫీజులను కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది.

అర్హతలు..

  • ఎస్సీ కేటగిరీకి చెందిన విద్యార్థులై ఉండాలి.

  • కుటుంబ వార్షికాదాయం అన్ని వనరుల నుంచి రూ. 8 లక్షల వరకు ఉండాలి.

  • గుర్తింపు పొందిన విద్యా సంస్థలో రెగ్యులర్ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

  • మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఇందులో 30 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు.

  • ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐఎం, ఎన్‌ఎల్‌యూలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొంది ఉండాలి.

దరఖాస్తు విధానం మరియు ఇతర నిబంధనలు

అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ప్రవేశ ర్యాంకు, ఫీజు వివరాలను పొందుపరచాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇతర ఉపకార వేతనాలు పొందుతున్నవారు ఈ పథకానికి అనర్హులు. అలాగే విద్యార్థి తదుపరి తరగతికి ప్రమోట్ కాకపోతే ఉపకార వేతనం నిలిపివేయబడుతుంది. అర్హులైన ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

Read latest Education News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 6 Sept 2026 | 11:17 PM IST
Tags: