హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను స్పీకర్ స్వయంగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌పై మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సీఎంవో అధికారికంగా విడుదల చేసింది. తాతా మధు వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలువడింది. సభ నుంచి తాతా మధును బహిష్కరించే దిశగా మండలి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందిస్తూ.. అసెంబ్లీకి స్పీకర్‌దే సర్వాధికారమని, ఆయనను ఎవరు దూషించినా తప్పేనని హెచ్చరించారు. స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి సీతక్క మాట్లాడుతూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవి కూడా స్పందిస్తూ, ఎస్సీ వర్గానికి చెందిన స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం దళితులపై జరుగుతున్న అవమానంగా అభివర్ణించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అవమానించిన తాతా మధును వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో కేసీఆర్ స్వయంగా వచ్చి సభలో క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.


