పెద్దకొత్తపల్లి: పెద్ద కార్పాముల గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకును (PNB) అక్కడి నుంచి పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి తరలిస్తున్నారనే వార్తలు రావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు బ్యాంకు తరలింపు ప్రయత్నాలను తక్షణమే నివారించాలని కోరుతూ భారతీయ జనతా యువజన మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు మేకల శివ మాట్లాడుతూ.. పెద్ద కార్పాముల పీఎన్బీ బ్యాంక్ చుట్టుపక్కల ఉన్న దాదాపు 12 గ్రామాలకు పైగా ప్రజలకు ఎంతో కాలంగా సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ ప్రాంతంలోని వృద్ధులు, వికలాంగులు, రైతులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఈ బ్యాంకుపైనే పూర్తిగా ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. అయితే, బ్యాంకులో పనిచేస్తున్న కొంతమంది అధికారులు తమ రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందనే స్వార్థపూరిత ఉద్దేశంతోనే ఈ బ్యాంకును పెద్దకొత్తపల్లికి మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజల ఇబ్బతులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మేకల శివతో పాటు దళిత మోర్చా మాజీ మండల అధ్యక్షులు సాతానీ శ్రీనివాస్, నాయకులు గడ్డి కోపుల శివ, బంటుపల్లి శివ, గుండాల శివ, గజ్జి సురేష్, కిరణ్, లింగారెడ్డి, మాగినేని యాదగిరి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొని అధికారులకు తమ నిరసనను తెలియజేశారు.


