నాంపల్లి: గురుపూజోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలో విద్యాబోధనలో విశేష ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయురాలు భూతరాజు సరిత మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తక విజ్ఞానమే కాకుండా సత్ప్రవర్తన, నైతిక విలువలను నేర్పడమే ఉపాధ్యాయురాలిగా తన ప్రథమ బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులను మెరుగుపరుస్తూ, ప్రతి విద్యార్థిలోనూ దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మరింత అంకితభావంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు.
భావితరాల నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రే అత్యంత కీలకమని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నాంపల్లి ఎంపీడీవో రామకృష్ణ శర్మ పేర్కొన్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సరితను ఘనంగా అభినందించారు. విద్యారంగంలో ఆమె అందిస్తున్న నిస్వార్థ సేవలు, బోధనాభ్యాసనలో ప్రదర్శిస్తున్న అంకితభావం తోటి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయమని కొనియాడారు.
గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మొత్తం 22 మంది ఉపాధ్యాయులను నాంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, మండల విద్యాధికారి (ఎంఈవో) అజయ్ కుమార్, తదితర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


