వాషింగ్టన్ / టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. అమెరికాకు చెందిన యుద్ధనౌకలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడానికి ప్రయత్నించడంతో, అమెరికా బలగాలు తీవ్ర ప్రతీకార దాడులకు దిగాయి. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లపై విరుచుకుపడి వాటిని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ పరిణామాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ (USCENTCOM) అధికారికంగా ధ్రువీకరించింది.
అమెరికా నావికాదళంపై దాడికి విఫలయత్నం..
అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అమెరికా అత్యాధునిక నౌకలు ఈ దాడుల నుంచి సురక్షితంగా తప్పించుకున్నాయి. ఈ ఘటనలో ఏ ఒక్క అమెరికా సైనికుడికీ ఎలాంటి గాయాలు కాలేదని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
3 ట్యాంకర్లపై అమెరికా ప్రతిదాడి..
ఇరాన్ దురాక్రమణకు ప్రతిస్పందనగా ఖర్గ్ ఐలాండ్, జాస్క్ సమీపంలో IRGCకి చెందిన M/T డౌనీ (M/T Downy), M/T స్టార్క్ 1 (M/T Stark 1) అనే రెండు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా బలగాలు పూర్తిగా నేలమట్టం చేశాయి. వీటితో పాటు ఒమన్ గల్ఫ్‌లో ఖాళీగా ఉన్న మరొక ఆయిల్ ట్యాంకర్ మీద కూడా క్షిపణి దాడులు జరిపాయి. ఈ మూడు ట్యాంకర్లు IRGC మరియు దాని అనుబంధ తీవ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చే బిలియన్ డాలర్ల అక్రమ 'షాడో నెట్వర్క్'లో భాగమని అమెరికా అధికారులు వెల్లడించారు.
అమెరికా తీవ్ర హెచ్చరిక..
యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. 'మా నౌకలపై మీరు దాడికి తెగబడితే, మేము మీ ట్యాంకర్లను ధ్వంసం చేసి అంతకంటే తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాం అనే సందేశం IRGCకి స్పష్టంగా వెళ్ళాలి. అమెరికా బలగాలను రక్షించుకోవడానికి, అవసరమైతే ఇరాన్ ఆయిల్ రవాణా నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేయడానికి మేం వెనుకాడబోం' అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఖర్గ్ ద్వీపం సమీపంలో తమ ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు ఇరాన్ స్థానిక వార్తా సంస్థ 'తస్నిమ్' పేర్కొంది. సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయించామని, ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఓపెక్ (OPEC) కూటమిలో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్ ద్వారానే గతంలో తన క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో దాదాపు 90 శాతాన్ని నిర్వహిస్తూ వచ్చింది.


