ఫిల్మ్ డెస్క్: తమిళనాట పూర్తిస్థాయి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ నటుడిగా నటిస్తున్న చిత్రం 'జననాయగన్'. గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇబ్బందులతో నిలిచిపోయిన ఈ మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ బోర్డు (CBFC) ల్యాబ్ పరిధిలో క్లియర్ అయింది.
చిత్రంలో ఉన్న పొలిటికల్ కంటెంట్, కొన్ని తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ కొన్ని మార్పులు సూచిస్తూ ఈ సినిమాకు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఖరారు చేసినట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ సెన్సార్ కట్స్, మోడిఫికేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారికంగా సర్టిఫికేట్ జారీ కానుంది. విజయ్ కెరీర్ లో ముఖ్యమంత్రి గా మొదటి చిత్రం కావడం, దీనికి తోడు రాజకీయ రంగు పులుముకున్న కథ కావడంతో ఈ అప్‌డేట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విడుదల తేదీలపై కసరత్తు
సెన్సార్ అడ్డంకులు తొలగిపోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ సినిమా విడుదల వ్యూహంపై దృష్టి సారించింది. థియేట్రికల్ విడుదలకు సంబంధించి వచ్చే వారం ప్రారంభంలోనే ప్రధాన డిస్ట్రిబ్యూటర్లతో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే వరల్డ్ వైడ్ థియేటర్ల కౌంట్, ప్రమోషన్స్ ప్రణాళికతో పాటు ఫైనల్ రిలీజ్ డేట్ లాక్ చేయనున్నారు.
ప్రస్తుతానికి జూలై 23 లేదా జూలై 30 తేదీలను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా డిజిటల్ ఓటీటీ భాగస్వామి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ టార్గెట్‌గా డిజిటల్ ప్రీమియర్ ప్లాన్ చేస్తుండటంతో.. జూలై మధ్యలోనే థియేటర్లలోకి తీసుకురావాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ ముగిసిన వెంటనే ప్రొడక్షన్ హౌస్ నుండి ఖచ్చితమైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.


