ఫిల్మ్ డెస్క్: టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ టైటిల్ రోల్‌లో తెరకెక్కిన సరికొత్త మైండ్ బెండింగ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' థియేటర్లలోకి వచ్చింది. విలక్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రయాణాన్ని స్థిరమైన వసూళ్లతో ప్రారంభించింది. ట్రేడ్ వర్గాల తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹3.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

​ఓవర్సీస్ మార్కెట్లలో భారీ వసూళ్లు

​ఈ చిత్రానికి దేశీయ మార్కెట్ కంటే ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్లలో ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభించింది. మొదటి రోజు వచ్చిన మొత్తం వసూళ్లలో సగానికి పైగా వాటా విదేశీ ప్రదర్శనల నుంచే రావడం గమనార్హం. ఓవర్సీస్ లో ఈ సినిమా తొలి రోజు ₹1.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భారతదేశంలో నెట్ వసూళ్లు ₹1.40 కోట్లు (గ్రాస్ ₹1.61 కోట్లు) గా నమోదయ్యాయి.

​తెలుగు రాష్ట్రాల పరిధిలో చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి ₹1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటకలో ₹13 లక్షలు, తమిళనాడులో ₹2 లక్షల వసూళ్లు నమోదయ్యాయి. సినిమాకు మార్నింగ్ షోల కంటే నైట్ షోలలో అత్యధికంగా 38 శాతం ఆక్యుపెన్సీ లభించడం విశేషం. లాంగ్ రన్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే శని, ఆదివారాల్లో వసూళ్లు భారీగా పుంజుకోవాల్సి ఉంటుంది.

వైవిధ్యమైన కథాంశం.. సూపర్ స్టాఫ్ ప్రెజెంటేషన్

​కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా ఐదేళ్ల విరామం తర్వాత రూపాందించిన ప్రతిష్టాత్మక చిత్రమిది. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా మేజికల్ రియలిజం, డార్క్ కామెడీ సమ్మేళనంతో విభిన్నమైన సామాజిక అంశాల చుట్టూ ఈ కథను నడిపించారు. ఒకప్పటి రాజకుటుంబ వారసత్వ నేపథ్యంలో జ్ఞాపకాలు, మానసిక సంఘర్షణల చుట్టూ సాగే ఈ మిస్టరీ డ్రామాలో సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ వీక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

​ఈ చిత్రంలో దీపా థామస్, వికాస్ ముప్పల కీలక పాత్రలు పోషించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పణలో జీఎంబీ (GMB) ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా సంయుక్తంగా నిర్మాణమైంది. వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST