ఫిల్మ్ డెస్క్: ప్రపంచ అత్యున్నత చలనచిత్ర వేదికైన ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ తరఫున పోటీపడేందుకు ఒక ప్రతిష్టాత్మక చిత్రం సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న ఆస్కార్-2027 (99వ) పురస్కారాల కోసం భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఎంపికైంది. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన మొత్తం 33 చిత్రాలు ఈ పోటీలో నిలవగా.. వాటన్నింటినీ వెనక్కి నెట్టి ‘గోంధల్’ ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంతో..

సంతోశ్ ధవకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మహారాష్ట్ర గ్రామీణ పరిస్థితులను, అక్కడి సామాజిక జీవన విధానాన్ని అత్యంత సహజంగా ప్రతిబింబిస్తుంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎఫ్ఎఫ్ఐ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా 2025 నవంబర్‌లో విడుదలైంది. థియేట్రికల్‌గా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా, అనేక జాతీయ, ప్రాంతీయ పురస్కారాలను సైతం కైవసం చేసుకుంది.

ఈ చిత్రంలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేశ్ సొహానీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం సమకూర్చడం విశేషం. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 18 Sept 2026 | 10:46 PM IST
Tags: